కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?

21 Jul 2021 Blog

కోవిడ్-19 నుంచి కోలుకున్న కొందరు రోగులకు కరోనావైరస్ పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది. కానీ, తర్వాత మళ్లీ పాజిటివ్ అని తేలింది.

సాధారణంగా ఫ్లూ, జలుబు లాంటి వ్యాధుల నుంచి కోలుకున్నవారిలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని భావిస్తారు. అందుకే, ఫ్లూ నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ అంత తొందరగా ఆ వ్యాధి రాదు. కోవిడ్-19 మాత్రం తొందరగా మళ్లీ తిరగబడుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. కారణం ఏంటి?

జపాన్‌లో ఓ 70 ఏళ్ల వ్యక్తికి పరీక్షలు చేయగా ఆశ్చర్యకరమైన, ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి.

ఆయనకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ కావడంతో ఫిబ్రవరిలో టోక్యో ఆసుపత్రిలో ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. చికిత్స అందించారు.

జపాన్ వార్తా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రకారం, ఆయన కోలుకుని మామూలు స్థితికి వచ్చారు. ప్రభుత్వ బస్సులు, రైళ్లలోనూ ప్రయాణించారు. కానీ, కొన్ని రోజుల తరువాత ఆయన మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు.

జ్వరం వచ్చిందంటూ ఆయన ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు పరీక్షలు చేస్తే షాకింగ్ విషయం బయటపడింది. ఆయనకు మళ్లీ కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.

జపాన్‌లో అలాంటి కేసులు ఇంకా చాలానే నమోదయ్యాయి. కరోనావైరస్ నుంచి కోలుకున్నవారిలో కొంతమందికే మళ్లీ పాజిటివ్ వస్తోంది. కానీ, ఆ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కారణం ఏంటి?

14 శాతం మందికి

కోవిడ్ -19 నుంచి కోలుకున్న రోగుల్లో కనీసం 14 శాతం మందికి తర్వాత పరీక్షలు చేస్తే మళ్లీ పాజిటివ్ అని వస్తోందని స్పానిష్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (సీఎస్ఐసీ)కి చెందిన అంటువ్యాధుల నిపుణులు లూయిస్ ఎంజువానెస్ బీబీసీతో చెప్పారు.

వారికి రెండోసారి సోకిందని చెప్పలేం కానీ, వైరస్ తిరగబెట్టడం వల్ల వారు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన అంటున్నారు.

“చాలావరకు కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌ల బారిన పడి కోలుకున్నవారిలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. కానీ, కొందరిలో అది బలహీనంగా ఉంటుంది. అలాంటి వారి శరీరంలో ఎక్కడో ఒకచోట దాగి ఉన్న వైరస్ మళ్లీ తిరగబడే ప్రమాదం ఉంటుంది” అని ఎంజువానెస్ వివరించారు.

శరీరంలో మూడు నెలలు

కొన్ని వైరస్‌లు మానవ శరీరంలో మూడు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం జీవించగలవు.

“వైరస్ సోకిన వారికి చికిత్స చేసిన తర్వాత నెగెటివ్ వస్తే, వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగినట్లుగా భావిస్తారు. అయితే, పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చినా మన శరీరంలోని కణజాలంలో ఎక్కడో ఒక చోట వైరస్‌ ఇంకా దాక్కునే అవకాశం ఉంది. అలాంటి వైరస్ మన శరీర రక్షణ వ్యవస్థకు చిక్కకపోవచ్చు. అలా దాక్కున్న వైరస్ కొన్నాళ్లకు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది” అని ఎంజువాన్స్ చెప్పారు.

కోవిడ్ -19 విషయంలో చూస్తే, దీని నుంచి కోలుకున్న తర్వాత స్వల్ప కాలంలోనే మళ్ళీ పాజిటివ్‌ అని వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

Source : https://www.bbc.com/telugu/international-52019421

OXYGEN CONCENTRATORS: ప్రాణం పోసే యంత్రం.. అసలు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ ఎలా పనిచేస్తాయంటే.

21 Jun 2021 Blog

Oxygen Concentrators: ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వాడేవారు వాటి సామర్థ్యం లేదా స్వచ్ఛత కంటే, వాటిని ఉపయోగించడం ద్వారా రోగి ఎంత ఆక్సిజన్‌ను తీసుకోగలడు అనేది చూడాలని నిపుణులు చెబుతున్నారు

భారత్‌లో రెండో దశ కోవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, కోవిడ్ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆరోగ్యం విషమించిన రోగులకు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ప్రాణవాయువు అందించాల్సి వస్తోంది. కొంతమందికి వెంటిలేటర్లు కూడా అవసరమవుతున్నాయి. కానీ బెడ్ల కొరతతో చాలామంది ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు సైతం భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఏర్పడ్డ ఆక్సిజన్ డిమాండ్‌ను తీర్చేందుకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను భారత్‌కు విరాళంగా అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కాన్సన్‌ట్రేటర్లు అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి ఉపయోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆక్సిజన్ కాన్సంట్రేర్ అంటే ఏంటి?
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అనేది ఒక మెడికల్ డివైజ్. ఈ యంత్రం గాలి నుంచి ఆక్సిజన్‌ను విడదీసి రోగులకు నేరుగా అందిస్తుంది. సాధారణంగా వాతావరణంలో ఉండే గాలిలో 78 శాతం నైట్రోజన్ ఉంటుంది. 21 శాతం ఆక్సిజన్‌ ఉంటుంది. ఒక శాతం వరకు విష వాయువులు కూడా ఉంటాయి. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఈ సహజ గాలి నుంచి కేవలం ఆక్సిజన్‌ను వడపోసి, మిగతా వాయువులను తిరిగి గాలిలోకి వదిలేస్తాయి. యంత్రాల్లో ఉండే ఒక రకమైన జల్లెడలు గాలి నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వడకడతాయి. దీన్ని ఆక్సిజన్ అవసరమైన రోగులకు అందించవచ్చు. ఈ పరికరాలు నిరంతరాయంగా, నిమిషానికి 10 లీటర్ల వరకు ఆక్సిజన్‌ను సరఫరా చేయగలవు. దీని స్వచ్ఛత 95 శాతం వరకు ఉంటుంది.

మార్కెట్‌లో లభిస్తాయా?
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు భారత్‌లోని బహిరంగ మార్కెట్లలో కూడా లభిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నిమిషానికి 5 లీటర్లు, 10 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలిగే కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్రాండ్లు నిమిషానికి 8 లీటర్లను కూడా అందిస్తున్నాయి. మహమ్మారికి ముందు 5 లీటర్ల కాన్సన్‌ట్రేటర్‌ డివైజ్ ధర సుమారు రూ.50,000 వరకు ఉండేది. ప్రస్తుతం డిమాండ్ ఏర్పడినందువల్ల వీటిని రూ.60,000-రూ.70,000కు అమ్ముతున్నారు.

సామర్థ్యం, స్వచ్ఛతను ఎలా గుర్తించాలి?
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వాడేవారు వాటి సామర్థ్యం లేదా స్వచ్ఛత కంటే, వాటిని ఉపయోగించడం ద్వారా రోగి ఎంత ఆక్సిజన్‌ను తీసుకోగలడు అనేది చూడాలని నిపుణులు చెబుతున్నారు. సామర్థ్యంతో సంబంధం లేకుండా రోగుల రక్తంలోకి ఆక్సిజన్ ఎంత వస్తుంది అనేది పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆక్సిజన్ సిలిండర్లకు, కాన్సన్‌ట్రేటర్లకు తేడాలేంటి?
ఆక్సిజన్ సిలిండర్లలో నిర్ణీత మొత్తంలో ఆక్సిజన్‌ను నింపుకొని వాడుకోవాలి. ఇవి ఖాళీ అయితే, సిలిండర్లలో మళ్లీ ఆక్సిజన్‌ నింపాల్సి ఉంటుంది. కానీ కాన్సన్‌ట్రేటర్ల విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఇవి ఒకరకమైన పరికరాలు. చుట్టూ ఉన్న గాలిని ఇవి ఫిల్టర్ చేస్తాయి. అయితే ఇవి విద్యుత్ సహాయంతో పనిచేస్తాయి. వీటిని ఉపయోగించేవారు నిరంతరం కరెంటు సప్లై ఉండేలా జాగ్రత్తపడాలి.

కోవిడ్ -19 రోగులకు ఇవి ఎంతవరకు సహాయపడతాయి?
దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి కృత్రిమంగా ఆక్సిజన్ అందించేందుకు కాన్సన్‌ట్రేటర్లను రూపొందించారు. కోవిడ్-19 వెలుగు చూసిన తరువాత ఆక్సిజన్ థెరపీ ఎక్కువ మందికి అవసరమవుతోంది. అందువల్ల వీటిని కరోనా సోకిన రోగుల చికిత్సలో కూడా వాడుతున్నారు. ఆక్సిజన్ అవసరం మరీ ఎక్కువగా లేని రోగులకు మాత్రమే వీటిని సిఫారసు చేస్తున్నారు. వీటిని వాడేవారు పల్స్ ఆక్సీమీటర్ సాయంతో ఎప్పటికప్పుడు శరీరంలో ఆక్సిజన్ స్థాయి కొలుచుకోవాలి. నిర్ణీత స్థాయికి ఆక్సిజన్ పడిపోతే హాస్పిటల్‌కు వెళ్లాలి.

ఎలాంటివి కొనుగోలు చేయాలి?
నిమిషానికి ఐదు లీటర్ల ఆక్సిజన్‌ను అందించే పరికరాల నుంచి వచ్చే ప్రాణవాయువు స్వచ్ఛత కనీసం 92-95 శాతం ఉండాలి. నకిలీ పరికరాలను కొని మోసపోకూడదు. 50 శాతం స్వచ్ఛత ఉండే ఆక్సిజన్‌ను అందించేవి చికిత్సకు పనికిరావు. ఫిలిప్స్, నిడెక్, ఆక్సిబ్లిస్, ఎయిర్‌సెప్, డెవిల్‌బిస్ వంటి బ్రాండ్‌లు మెడికల్ డివైజ్‌లను తయారు చేస్తున్నాయి. ఈ బ్రాండ్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.

Source: https://telugu.news18.com/news/explained/what-is-oxygen-concentrator-how-it-works-all-you-need-to-know-about-these-devices-sk-gh-855912.html

కోవిడ్ బాధితుల్లో ‘ఆక్సిజన్’ సమస్య ఎందుకు వస్తుంది? శరీరంలో ఏం జరుగుతుంది?

21 May 2021 Blog

ఆక్సిజన్ సమస్య ఎందుకు వస్తుంది?: కరోనా వైరస్ శరీరానికి అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన ఊపిరితీత్తుల్లో తిష్ట వేస్తుందనే సంగతి తెలిసిందే. మొదట్లో వైరస్ సోకిన 5 రోజుల్లో లక్షణాలు కనిపించేవి. కానీ, ఇప్పుడు ముదిరిన తర్వాతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా టెస్టుల్లో నెగటివ్ వచ్చినవారు తమలో వైరస్ లేదని భావించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. ఫలితంగా వైరస్ నెమ్మదిగా ఊపిరితీత్తుల్లో విస్తరించి.. అకస్మాత్తుగా దాడి చేస్తోంది. దీన్ని కేవలం సిటీ స్కాన్ ద్వారా మాత్రమే గుర్తించగలుగుతున్నారు. అందుకే, టెస్టుల్లో మీకు నెగటివ్ వచ్చినా.. వైద్యుల సూచనతో సిటీస్కాన్ కూడా తీయించుకుని జాగ్రత్తగా ఉండటం ఉత్తమం.

శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో తెలిసిందే. సాధారణంగా మనిషులు నిమిషానికి 7 లేదా 8 లీటర్ల గాలిని పీల్చి వదులుతారు. అంటే రోజుకు సుమారు 11 వేల లీటర్ల గాలిని శ్వాసిస్తారు. ఇలా పీల్చేగాలిలో కేవలం 20 శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. ఇందులో ఊపరితీత్తులు నిమిషానికి కేవలం 5 లేదా 6 మిల్లీ లీటర్ల ఆక్సిజన్ మాత్రమే ఉపయోగించుకుంటాయి. ఒక వేళ ఊపిరితీత్తులు పాడైతే.. సాధారణం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ గ్రహిస్తాయి.

కరోనా వస్తే ఏం జరుగుతుంది?: కోవిడ్-19 ఊపిరితీత్తుల్లోకి వెళ్లి.. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది. ఈ సందర్భంగా అది ఊపిరితీత్తులు ఆక్సిజన్ గ్రహించే శక్తిని అడ్డుకుంటుంది. ఆక్సిజన్ ఉత్పత్తిని అడ్డుకోవడమే కాకుండా.. ఊపిరితీత్తులకు రక్తాన్ని అందించే నాళాలను గడ్డకట్టిస్తుంది. ఫలితంగా శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ సరఫరా కాదు. ఇది క్రమేనా న్యుమోనియాకు దారి తీస్తుంది. ఫలితంగా రక్తంలోనూ ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఆక్సిమీటర్ ద్వారా ఈ మార్పును గుర్తించవచ్చు. ఆక్సిజన్ శాతం 94 నుంచి 90 మధ్యన చూపిస్తుంటే శరీరానికి అదనంగా ఆక్సిజన్ అవసరమని అర్థం. ఆ సమయంలో శరీరానికి ఎంత ఆక్సిజన్ అవసరమనేది కేవలం వైద్యులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి.. ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలోనే ఆక్సిజన్ తీసుకోవాలి. లేకపోతే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బాధితుడు తిరిగి తనంతట తానే ఊపిరి పీల్చుకొనే వరకు ఆక్సిజన్ అవసరమవుతుంది. కాబట్టి.. మీరు శరీరంలో ఆక్సిజన్ శాతం మీద నిఘా పెట్టండి. అది ఎప్పుడు తగ్గుతున్నట్లు అనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించండి.

ఎలా గుర్తించాలి?: శరీరంలో ఆక్సిజన్ కొరతను గుర్తించడానికి ‘పల్స్ ఆక్సీమీటర్’ అందుబాటులోకి వచ్చింది. దాన్ని మన చేతి వేలుకు పెట్టుకుంటే చాలు.. మన శరీరంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో చెప్పేస్తుంది. శరీరంలో 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారు రోజులో 3 నుంచి 4 సార్లు ఆక్సిమీటర్ ద్వారా చెక్ చేసుకోవాలి. ఆక్సిజన్ 94 కంటే తగ్గిపోతూ కనిపిస్తే.. మీకు ఆక్సిజన్ అవసరం పడుతుందని అర్థం. సమయానికి మీరు ఆక్సిజన్ అందుకుంటే బతికే అవకాశాలు ఉంటాయి.

ఇలా కూడా గుర్తించవచ్చు: ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి, గందరగోళం, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు.. శరీరంలో ఆక్సిజన్ తగ్గుతుందని హెచ్చరిస్తాయి.

ముఖ్య గమనిక: ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Source: https://telugu.samayam.com/lifestyle/health/covid-19-lung-damage-what-happens-if-your-oxygen-level-is-too-low/articleshow/82263421.cms

కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి? వేటిని దూరం పెట్టాలి?

21 Apr 2021 Blog

రోజూ మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకుంటే, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టొచ్చని వైద్య ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి.

మనలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) మెరుగ్గా ఉంటే పలు వైరస్‌లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

అందుకోసం, మన ఆహారంలో ఎలాంటి పదార్థాలు ఉండాలి? ఎలాంటి పదార్థాలను దూరం పెట్టాలి? అన్న విషయాలపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిధిలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు పలు సలహాలు, సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.

శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఎ దోహదపడుతుంది. ఇ, బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

సమతుల ఆహారం ద్వారా ఈ పోషకాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే, కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, అన్ని పోషకాలూ సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాయలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి.

  • తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా (ప్రతి వ్యక్తి రోజుకు 450 నుంచి 500 గ్రాముల వరకు) తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.
  • స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో ఈ పోషకాలు లభిస్తాయి.
  • అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి.
  • కార్బోనేటేడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే, వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి ముఖ్యమైన పోషకాలు తక్కువగా ఉంటాయి.
  • మాంసం, గుడ్లు తినడం ప్రమాదమేమీ కాదు. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి. అయితే పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • శరీరంలో కొవ్వు(ఫ్యాట్)ను నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ ఒక వ్యక్తి 30 గ్రాములకు మించి నూనెలు, 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. చక్కెరలో కేవలం కెలొరీలు మాత్రమే ఉంటాయి, పోషకాలు ఉండవు. కాబట్టి, చక్కెరను కూడా మితంగా తీసుకోవాలి.
  • శారీరక వ్యాయామం, యోగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  • తరచూ నీళ్లు తాగుతుండాలి. ధూమపానం, మద్యపానం వల్ల రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. ఆ అలవాట్లు ఉన్నవారికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వాటిని మానుకోవాలి.

మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి దాకా వాడుతున్న మందులను కొనసాగించవచ్చు. వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలని హైదరాబాద్‌ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ ఆర్.హేమలత సూచిస్తున్నారు.

బొప్పాయి, జామ, ఆపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకునేందుకు అవి ఎంతగానో సాయపడతాయి.

నారింజ, నిమ్మకాయలు, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

ఆకు కూరల్లో బీటా కెరోటీన్, విటమిన్ సీ, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ దండిగా దొరుకుతాయి.

ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయలూ, సుగంధ ద్రవ్యాలలోనూ రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు రకాల సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమవుతాయి.

Source: https://www.bbc.com/telugu/india-52533656

పార్కిన్సన్స్ మరియు వణుకుడు వ్యాధి

21 Mar 2021 Blog

పార్కిన్సన్స్ నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డొపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు దెబ్బదినటం, క్షీణించటం కారణంగా ఏర్పడుతుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాల నుండి శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి(కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనిని తయారుచేసే కణాలు క్షీణించటం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీంతో శరీర భాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతారు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అరవై సంవత్సరాలు పైబడిన వారే ఎక్కువగా పార్కిన్సన్స్ వ్యాధికి గురవుతుంటారు.కొన్ని కుటుంబాలలో మాత్రం వంశపారంపర్యంగా వస్తూ చిన్నవయస్సులోని వారిలో కనిపిస్తుంది. మనదేశంలో కోటి మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

సరైన సమయంలో డాక్టరును సంప్రదించి ఆధునిక ఏర్పాట్లుగల ఆస్పత్రిలో చికిత్సి చేయించుకోవటం ద్వారా దీనిని అదుపుచేసేందుకు వీలుంటుంది. పార్కిన్సన్ వ్యాధి చికిత్స సమూలంగా మారిపోయింది. ఈ వ్యాధిగ్రస్థులు తమను వేధిస్తున్న లక్షణాలను అదుపుచేసుకొని సాధారణ జీవితం గడిపేందుకు ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్య(ఔషధ)పరమైన, సర్జికల్ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. పార్కిన్సన్ వ్యాధి మధ్యస్థాయిలో ఉండి శారీరక పరిమతులు ఎదుర్కొంటున్న వ్యక్తులలో వ్యాధి లక్షణాలను అదుపు చేయటంతోపాటు వాడుతున్న మందుల నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు ఆధునిక చికిత్సలు తోడ్పడుతున్నాయి. మందుల ప్రయోజనం అగుపిస్తున్న, అదృశ్యమౌతున్నస్థితిల మధ్య ఊగిసలాడుతుంటే పార్కిన్సన్ వ్యాధిగ్రస్థులకు అత్యుత్తమ శస్త్రచికిత్సలు ఉపశమనం ఇస్తున్నాయి. శరీరం విపరీతంగా చలిస్తుండే పార్కిన్సన్ పేషంట్లూ వీటి వల్ల ప్రయోజనం పొందగలుగుతున్నారు.

వ్యాధికి కారణం ఏమిటి?
పార్కిన్సన్స్ వ్యాధి రావటానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూన్నాయి. ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాలు, పరిశీలన ఆధారంగా కొన్ని ప్రాధమిక కారణాలను మాత్రం గుర్తించగలిగారు. అవి: జన్యుపరమైన కారణం – అత్యధిక కేసులలో పార్కిన్సన్స్ వ్యాధి వంశపారంపర్యంగా రావటంలేదు. అయితే వ్యాధికి గురైన వారిలో 15-25 శాతం మంది కుటుంబంలో ఒకరికి ఈ వ్యాధి ఉంటున్నది. వాతావరణ కాలుష్యం -పరిసరాలలోని రసాయనాలు కొన్ని ప్రజలలో డోపమైన్ తయారీ శక్తిని దెబ్బదీస్తున్నట్లు కొందరు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. డోపమైన లోపం సహజంగానే వణుకుడు వ్యాధికి దారితీస్తుంది. క్రిమి,కీటకనాశనలు – కాయగూరలు, ఆహార పంటలపై చీడ పీడలను అదుపుచేయటానికి వాడే క్రిమి సంహారక మందుల అవశేషాలు ఆహారం ద్వార శరీరంలోకి చేరటం వల్ల మెదడులోని డొపమైన్ ను ఉత్పిత్తి చేసే నాడీ కణాలు చనిపోతున్నట్లు భావిస్తున్నారు. వయస్సు- వణుకుడు వ్యాధికి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న కారణం వయసు పై బడటం. ప్రధానంగా అరవై ఏళ్లు దాటిన వారే ఈ వ్యాధికి గురవుతున్నారు. వీరిలో స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే వణుకుడు వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నది. తలకు గాయం- తలకు తీవ్రమైన గాయం కావటం పార్కిన్సన్స్ వ్యాధి రావటానికి గల అవకాశాలను గణనీయంగా పెంచివేస్తున్నది. లోహపు గనుల్లో పనిచేస్తుండటం – మనదేశంలో మాంగనీస్ గనులలో పనిచేసిన కార్మికులలో ఎక్కువ మంది పార్కిన్సన్స్ వ్యాధికి గురయినట్లు గుర్తించారు.

పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు
వ్యాధి ప్రారంభంలో ఆహార పదార్థాల రుచి, వాసన గుర్తించటంలో లోపం ఏర్పడుతుంది. ఇదివరలో ఎంతో ఇష్టంగా తిన్న వంటల పట్ల ఇపుడు ఆసక్తిపోతుంది. రుచిని, పరిమళాన్ని గుర్తించలేని స్థితిలో ఆహారం రుచించదు. ఆపైన ముకవళికలు మారిపోతాయి. ఇదివరలో చిరునవ్వు చిందిస్తూ కనిపించిన వ్యక్తి ముఖం ఎన్నడూలేనంత గంభీరంగా తయారవుతుంది. దీనినే ఫెషియల్ మాస్కింగ్ అంటున్నారు. శరీరం కాస్తవంగిపోతుంది. కదలికలు నెమ్మదిగా, బిగుతుగా మారతాయి. వ్యాధి ముదరుతుండటంతో చేతివెళ్లతో వణుకు మొదలవుతుంది. ఆపైన చేయి, కాలు వణుకుతుంటాయి. ఏ పనీచేయకుండా ఉన్న సమయంలో చేతివేళ్లు, చెయ్యి, కాళ్లు, సెకనుకు నాలుగైదు సార్లు వణుకుతుంటాయి. అదే విధంగా చూపుడువేలు, బొటనవేలు లయబద్దంగా రాపిడికి గురవుతుంటాయి. చేతులు, కాళ్లు వణికే ఈ పరిస్థితిలో నడవటం చాలా ఇబ్బందికరం అవుతుంది. ఈ పరిస్థితిలో వ్యక్తి తన అవయవాలపై అదుపుకోల్పోతున్నట్లు గుర్తించగలుగుతారు. ఈ రకమైన లక్షణాలు కనిపించిన వారిలో దాదాపు 70 శాతం మందికి సంబంధించి అవి పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభంగా డాక్టర్లు గుర్తించారు. ఈ వ్యాధి నిర్ధారణకు ఖచ్చితమైన పరీక్షలు అంటూ ఏమీ లేవు. డాక్టర్లే ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, లక్షణాలను అడిగితెలుసుకోవటం ద్వారా వ్యాధిని, దాని స్థాయిని గూర్చిన ఓ అవగాహనకు వస్తారు. అయితే పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులోని ఇతర భాగాలకు ఏమైనా ప్రమాదం ఉందా అన్న అంశానికి వారు మెుదట ప్రాధన్యాతను ఇస్తారు. ఇందుకోసం బ్రెయిన్ స్కాన్, ఎం.ఆర్.ఐ. వంటి నిర్ధారణ పరీక్షలుచేసి అనుమానాలు నివృత్తి చేసుకుంటారు.

చికిత్స
వణుకుడు వ్యాధి చికిత్స ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపుచేసి, వ్యాధిగ్రస్థులు సాధారణ జీవితం గడిపేట్టు చేసే లక్ష్యంతోనే సాగుతుంది. ఇందుకుగాను వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్యపరిస్థితి – శరీరతత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చికిత్సా వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు మందులు, ఫిజియో థెరపీ, అవసరాన్ని బట్టి శస్త్ర చికిత్సను ఉపయోగపడతాయి. దాదాపు నాలుగు దశాబ్ధాల క్రితం కనిపెట్టిన ఎల్ డోపా అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది. శక్తివంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేని పక్షంలో డోసేజ్ మొత్తంలో లోటుపాట్లు ఏమైనా జరిగితే మొత్తంగా మెదడును దెబ్బదిసే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సాయపడుతూ డొపమైన్ ఉత్పత్తి జరిగేట్లు చేస్తుంది. దీంతో అవయవాలు బిగుసుకుపోవటం, వణుకుడు తగ్గుతుంది.

డి.బి.ఎస్. సర్జరీ
పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు సంబంధించి డి.బి.ఎస్.(డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) కీలకమైన శస్త్రచికిత్స. పార్కిన్సన్ వ్యాధి పెరుగుదల నిరోధించటంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డి.బి.ఎస్) శస్త్రచికిత్స ఎంతగానో తోడ్పడుతున్నట్లు గుర్తించారు. ఇది వ్యాధి పెరుగుదలను నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరచేందుకు పేస్ మేకర్ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వార మెదడులో ఎలక్ట్రోడ్లను అమరుస్తారు. ఇందుకుగాను ముందుగా ఎం.ఆర్.ఐ., సి.టి.స్కాన్ ద్వార వ్యాధిగ్రస్థుల మెదడులో సమస్య ఎక్కడు ఏర్పడింది గుర్తిస్తారు. ఆపైన ఈ చిన్న ఎలక్ట్రోడ్ ను అమరుస్తారు. దీనికి ఓ చిన్న బాటరీ-తీగ ఉంటాయి. మెదడులోని కొన్ని కణాలను తొలగించటం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వటం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. డోపమైన్ తయారీ పునరుద్ధరించగలుగుతారు. పెద్దగా రక్తస్రావం జరగకుండా, ఇన్ఫెక్షన్లకు అవకాశం లేకుండా పూర్తయ్యే ఈ శస్త్రచికిత్స మెదడు శరీరభాగాలను తన అదుపులోకి తెచ్చుకోవటానికి తోడ్పడుతుంది. ఈ సర్జరీలో మెదడులో రక్తస్రావం లాంటి ప్రమాదాలు 2శాతం కంటే తక్కువ. ఇది పార్కిన్సన్ వ్యాధిని లక్షణాలను తీసివేయలేదు. కానీ వాటిని అదుపులో ఉంచగలదు. ఇది సంక్లిష్యమైన, క్రమం తప్పకుండా న్యూరలాజికల్ ఫాలోఅప్ అవసరమైన సర్జరీ. అయితే ఔషధ చికిత్సచేస్తున్నప్పుటికీ వ్యక్తి జీవననాణ్యత ఏమాత్రం ఆమోదకరం కాని స్థాయికి దిగజారినపుడు డి.బి.ఎస్. ప్రభావశీలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.
అయితే మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చాలా సున్నితమైనదని, నిపుణులైన సర్జన్లు అత్యాధునిక పరికరాలు, వసతుల మధ్య నిర్వహించవలసిందని యశోద హాస్పిటల్స్ లోని డిపార్టమెంట్ ఆఫ్ న్యూరాలజీ & న్యూరో సర్జరీకి చెందిన వైద్యనిపుణులు చెప్పారు. అందువల్ల పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో భాగంగా డి.బి.ఎస్. సర్జరీ చేయించుకోవలసి వచ్చిన పక్షంలో అందుకు అనుగుణమైన ఏర్పాట్లు ఉన్న ఆస్పత్రిని ఎంపికచేసుకోవటంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

నీరుపేద కూలికి ఉచిత శాస్త్ర చికిత్స

21 Feb 2021 Blog

మందమరిలోని చేతులాపూర్ కు చెందిన నిరుపేద కూలి మాసూ సమ్మయ్య (42)కు శ్రీ విద్య ఫౌండేషన్ ఆద్వర్యంలో  ఉచిత శస్త్ర చికిత్స నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన శ్రీ విద్య ఫౌండేషన్ ఆద్వర్యంలో ఈ నెల 11 న సీఈఓ డాక్టర్ దాసా రాపు శ్రీనివాస్ చటులాపూర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సమ్మయ్య దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ పలు హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నాడు. ఆర్థిక ఇబందుల తో అనారోగ్యం తో ఇంట్లోనే ఉంటున్నాడు. శ్రీ విద్య ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో సమయ పరిస్దితిని డాక్టర్ శ్రీనివాస్ తెలుసుకున్నారు. మంచిర్యాల లోని మేడి లైఫ్ హాస్పిటల సమ్మయ్య కు ఉచిత శస్త్ర చికిత్స నిర్వహిస్తానని, అందుకు సహకరించాలని యాజమాన్యాన్ని కోరడంతో వారు అంగీకరించారు. దీనితో మేడిలైఫ్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో డాక్టర్ శ్రీనివాస్ సోమవారం రాత్రి ఆపరేషన్ చేసి రాళ్లను తొలగించారు. పిత్తాశయం తీసివేశారు. ఉచితంగా ఆపరేషన్ చేసి మానవత్వాన్ని చాటిన శ్రీ విద్య ఫౌండేషన్ కు , సహకరించిన మేడిలైఫ్ హాస్పిటల్ కు సమ్మయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేడిలైఫ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వంశీ, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ కుమారస్వామి,సిబ్బంది ఉపేందర్ , సురేష్ పాల్గొన్నారు.

మూడు కిలోల కణిత తొలగింపు

21 Jan 2021 Blog

జిల్లా కేంద్రం లోని ఓ ఆసుపత్రి లో కష్టసాధ్యమైన శస్త్రచికిత్స చేసారు .ఓ మహిళ కడుపులోని దాదాపు ౩ కిలోల కణితిని తొలగించి ఆమె ప్రాణాలు కాపాడారు. పట్టణానికి చెందిన 36 ఏళ్ళ మహిళ ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతూ స్ధానిక ఆసుపత్రికి వెళ్లగా గర్భసంచికి గడ్డలు అయ్యాయని తేలింది .చాలా బరువుతో పాటు ఇబ్బందికర పరిస్థితి ఉండటంతో తప్పనిసరి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబసభ్యుల అంగీకారంతో కణితితోపాటు గర్భసంచిని తొలగించారు.మూడు రోజుల పాటు పర్యవేక్షించి పూర్తిగా కోలుకోవడంతో శనివారం డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు

అనాధ పిల్లలకు ఉచిత వైద్యం

21 Dec 2020 Blog

అనాధ పిల్లలకు ఉచిత వైద్యం అందించడం లో మేడిలైఫ్ వైద్యుల ఔదార్యం
త్వరలో మేడిలైఫ్ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ వర్తింపు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మేడిలైఫ్ ఆసుపత్రిలో అనాథ పిల్లలకు ఉచిత వైద్యం అందిస్తు వారి ఔదర్యాన్ని చాటుకుంటున్నారు వైద్యులు కుమారస్వామి .జిల్లాలలోని అనాథ పిల్లలకు ఏదైనా జబ్బు చేసి ఆసుపత్రిలో చేరితే వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు .గతంలో చెన్నూర్ పట్టణానికి చెందిన ఒక బాలిక విషజ్వరంతో భాద పడుతూ ఎన్నో మందులు వాడి ,ఆసుపత్రుల చుట్టు తిరిగి నయం కాలేదు .ఆ బాలికను స్ధానికులు కొందరు మేడిలైఫ్ చేర్పించగా వైద్యుడు కుమారస్వామి ఆ బాలికకు ఉచితం వైద్యం చేసి ,బాలికకు పూర్తిగా తగ్గేవరకు ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు చేశారు.ఇదొక్కటే కాదు ఇలా ఎంతో మందికి ఉచిత వైద్యం చేస్తు అందరితో మన్ననలు పొందుతూ ,ఆసుపత్రి కీర్తిని జిల్లాల నలుమూలల వ్యాపింపజేస్తున్నారు .డాక్టర్ కుమార స్వామి ,త్వరలో ఆరోగ్య శ్రీ గుర్తింపు కూడా మేడిలైఫ్ ఆసుపత్రికి రానుంది .ఇక నుండి వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ఈ ఆరోగ్య శ్రీ ద్వారా తమ ఆసుపత్రిలో వైద్యసేవలు అందజేయనున్నట్లు వైద్యుడు కుమారస్వామి తెలిపారు .

ప్రోనింగ్‌తో ప్రాణవాయువు

18 Jun 2016 Blog
  • కరోనా వైరస్‌ రెండో విజృంభణతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ రోగులు ఎక్కువగా శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో మెడికల్‌ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ సోకిన వారికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే శ్వాస సమస్యలను అధిగమించొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా ‘ప్రోనింగ్‌’ (ప్రత్యేకమైన పొజిషన్‌లలో పడుకొని ఊపిరి తీసుకోవడం) వల్ల శ్వాసతో పాటు ఆక్సిజన్‌ స్థాయులను మెరుగుపరచుకోవచ్చని చెబుతోంది.
  • ఛాతి, పొట్టభాగంపై బరువుపడే విధంగా (బోర్లా) పడుకోవడం లేదా ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ చేరుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ‘ప్రోనింగ్‌’గా పిలిచే ఈ విధానం వైద్యపరంగా ధ్రువీకరణ పొందిందని పేర్కొంది. ముఖ్యంగా ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు ‘ప్రోనింగ్‌’ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.
    ‘ప్రోనింగ్‌’ ద్వారా శ్వాస తీసుకునే విధానం:
  • మొదట మంచంపై బోర్లా పడుకోవాలి.
  • ఒక మెత్తటి దిండు తీసుకుని మెడ కిందభాగంలో ఉంచాలి.
  • ఛాతి నుంచి తొడ వరకూ ఒకటి లేదా రెండు దిండ్లను ఉంచవచ్చు.
  • మరో రెండు దిండ్లను మోకాలి కింద భాగంలో ఉండేలా చూసుకోవాలి.
  • ఇక ఎక్కువ సమయం పడకపై ఉండే రోగులకు రోజంతా ఒకేవిధంగా కాకుండా పలు భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవచ్చు.
    తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
  • భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్‌ చేయవద్దు.
  • తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ప్రోనింగ్‌ చేయండి.
  • పలు సమయాల్లో రోజులో గరిష్ఠంగా 16 గంటల వరకు ప్రోనింగ్‌ చేయవచ్చు.(వైద్యుల సూచనల మేరకు)
  • హృద్రోగ సమస్యలు, గర్భిణిలు, వెన్నెముక సమస్యలున్నవారు ఈ విధానానికి దూరంగా ఉండాలి.
  • ప్రోనింగ్‌ సమయంలో దిండ్లను సౌకర్యవంతంగా ఉండేలా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.
    ప్రయోజనాలు:
  • ప్రోనింగ్‌ పొజిషన్‌ వల్ల శ్వాసమార్గం సరళతరమై గాలి ప్రసరణ మెరుగవుతుంది.
  • ఆక్సిజన్‌ స్థాయులు 94శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్‌ అవసరం.
  • ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయులు, రక్తంలో చక్కెర స్థాయులను పరిశీలించడం ఎంతో ముఖ్యం
  • మంచి వెంటిలేషన్‌, సకాలంలో ‘ప్రోనింగ్‌’ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు.
    ఇక సాధారణ పద్ధతిలో ఆక్సిజన్‌ స్థాయులను పెంచేందుకు ప్రోనింగ్‌ సురక్షిత పద్ధతేనని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రస్తుతం కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అవసరం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు ప్రోనింగ్‌ ఎంతో దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రోనింగ్‌ గురించి మీ దగ్గరిలో ఉన్న వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలి. మీ శరీరం అందుకు సహకరిస్తుందా? లేదా? అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Search

+