OXYGEN CONCENTRATORS: ప్రాణం పోసే యంత్రం.. అసలు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ ఎలా పనిచేస్తాయంటే.

21 Jun 2021 Blog

Oxygen Concentrators: ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వాడేవారు వాటి సామర్థ్యం లేదా స్వచ్ఛత కంటే, వాటిని ఉపయోగించడం ద్వారా రోగి ఎంత ఆక్సిజన్‌ను తీసుకోగలడు అనేది చూడాలని నిపుణులు చెబుతున్నారు

భారత్‌లో రెండో దశ కోవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు, కోవిడ్ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆరోగ్యం విషమించిన రోగులకు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ప్రాణవాయువు అందించాల్సి వస్తోంది. కొంతమందికి వెంటిలేటర్లు కూడా అవసరమవుతున్నాయి. కానీ బెడ్ల కొరతతో చాలామంది ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు సైతం భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఏర్పడ్డ ఆక్సిజన్ డిమాండ్‌ను తీర్చేందుకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను భారత్‌కు విరాళంగా అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కాన్సన్‌ట్రేటర్లు అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి ఉపయోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆక్సిజన్ కాన్సంట్రేర్ అంటే ఏంటి?
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అనేది ఒక మెడికల్ డివైజ్. ఈ యంత్రం గాలి నుంచి ఆక్సిజన్‌ను విడదీసి రోగులకు నేరుగా అందిస్తుంది. సాధారణంగా వాతావరణంలో ఉండే గాలిలో 78 శాతం నైట్రోజన్ ఉంటుంది. 21 శాతం ఆక్సిజన్‌ ఉంటుంది. ఒక శాతం వరకు విష వాయువులు కూడా ఉంటాయి. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఈ సహజ గాలి నుంచి కేవలం ఆక్సిజన్‌ను వడపోసి, మిగతా వాయువులను తిరిగి గాలిలోకి వదిలేస్తాయి. యంత్రాల్లో ఉండే ఒక రకమైన జల్లెడలు గాలి నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వడకడతాయి. దీన్ని ఆక్సిజన్ అవసరమైన రోగులకు అందించవచ్చు. ఈ పరికరాలు నిరంతరాయంగా, నిమిషానికి 10 లీటర్ల వరకు ఆక్సిజన్‌ను సరఫరా చేయగలవు. దీని స్వచ్ఛత 95 శాతం వరకు ఉంటుంది.

మార్కెట్‌లో లభిస్తాయా?
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు భారత్‌లోని బహిరంగ మార్కెట్లలో కూడా లభిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నిమిషానికి 5 లీటర్లు, 10 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలిగే కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్రాండ్లు నిమిషానికి 8 లీటర్లను కూడా అందిస్తున్నాయి. మహమ్మారికి ముందు 5 లీటర్ల కాన్సన్‌ట్రేటర్‌ డివైజ్ ధర సుమారు రూ.50,000 వరకు ఉండేది. ప్రస్తుతం డిమాండ్ ఏర్పడినందువల్ల వీటిని రూ.60,000-రూ.70,000కు అమ్ముతున్నారు.

సామర్థ్యం, స్వచ్ఛతను ఎలా గుర్తించాలి?
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను వాడేవారు వాటి సామర్థ్యం లేదా స్వచ్ఛత కంటే, వాటిని ఉపయోగించడం ద్వారా రోగి ఎంత ఆక్సిజన్‌ను తీసుకోగలడు అనేది చూడాలని నిపుణులు చెబుతున్నారు. సామర్థ్యంతో సంబంధం లేకుండా రోగుల రక్తంలోకి ఆక్సిజన్ ఎంత వస్తుంది అనేది పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆక్సిజన్ సిలిండర్లకు, కాన్సన్‌ట్రేటర్లకు తేడాలేంటి?
ఆక్సిజన్ సిలిండర్లలో నిర్ణీత మొత్తంలో ఆక్సిజన్‌ను నింపుకొని వాడుకోవాలి. ఇవి ఖాళీ అయితే, సిలిండర్లలో మళ్లీ ఆక్సిజన్‌ నింపాల్సి ఉంటుంది. కానీ కాన్సన్‌ట్రేటర్ల విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఇవి ఒకరకమైన పరికరాలు. చుట్టూ ఉన్న గాలిని ఇవి ఫిల్టర్ చేస్తాయి. అయితే ఇవి విద్యుత్ సహాయంతో పనిచేస్తాయి. వీటిని ఉపయోగించేవారు నిరంతరం కరెంటు సప్లై ఉండేలా జాగ్రత్తపడాలి.

కోవిడ్ -19 రోగులకు ఇవి ఎంతవరకు సహాయపడతాయి?
దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి కృత్రిమంగా ఆక్సిజన్ అందించేందుకు కాన్సన్‌ట్రేటర్లను రూపొందించారు. కోవిడ్-19 వెలుగు చూసిన తరువాత ఆక్సిజన్ థెరపీ ఎక్కువ మందికి అవసరమవుతోంది. అందువల్ల వీటిని కరోనా సోకిన రోగుల చికిత్సలో కూడా వాడుతున్నారు. ఆక్సిజన్ అవసరం మరీ ఎక్కువగా లేని రోగులకు మాత్రమే వీటిని సిఫారసు చేస్తున్నారు. వీటిని వాడేవారు పల్స్ ఆక్సీమీటర్ సాయంతో ఎప్పటికప్పుడు శరీరంలో ఆక్సిజన్ స్థాయి కొలుచుకోవాలి. నిర్ణీత స్థాయికి ఆక్సిజన్ పడిపోతే హాస్పిటల్‌కు వెళ్లాలి.

ఎలాంటివి కొనుగోలు చేయాలి?
నిమిషానికి ఐదు లీటర్ల ఆక్సిజన్‌ను అందించే పరికరాల నుంచి వచ్చే ప్రాణవాయువు స్వచ్ఛత కనీసం 92-95 శాతం ఉండాలి. నకిలీ పరికరాలను కొని మోసపోకూడదు. 50 శాతం స్వచ్ఛత ఉండే ఆక్సిజన్‌ను అందించేవి చికిత్సకు పనికిరావు. ఫిలిప్స్, నిడెక్, ఆక్సిబ్లిస్, ఎయిర్‌సెప్, డెవిల్‌బిస్ వంటి బ్రాండ్‌లు మెడికల్ డివైజ్‌లను తయారు చేస్తున్నాయి. ఈ బ్రాండ్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది.

Source: https://telugu.news18.com/news/explained/what-is-oxygen-concentrator-how-it-works-all-you-need-to-know-about-these-devices-sk-gh-855912.html

Search

+