కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి? వేటిని దూరం పెట్టాలి?

21 Apr 2021 Blog

రోజూ మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు ఉండేలా చూసుకుంటే, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా ఎన్నో వ్యాధులను తరిమి కొట్టొచ్చని వైద్య ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి.

మనలో రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) మెరుగ్గా ఉంటే పలు వైరస్‌లు, వ్యాధులను కూడా సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

అందుకోసం, మన ఆహారంలో ఎలాంటి పదార్థాలు ఉండాలి? ఎలాంటి పదార్థాలను దూరం పెట్టాలి? అన్న విషయాలపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిధిలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు పలు సలహాలు, సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. హానికారక సూక్ష్మ క్రిములను మనలోని రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఎదుర్కోవడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.

శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఎ దోహదపడుతుంది. ఇ, బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

సమతుల ఆహారం ద్వారా ఈ పోషకాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే, కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, అన్ని పోషకాలూ సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రధానంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, కాయలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి.

  • తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా (ప్రతి వ్యక్తి రోజుకు 450 నుంచి 500 గ్రాముల వరకు) తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.
  • స్థానికంగా పండే ధాన్యాలు, ఆయా సీజన్లలో దొరికే పండ్లలో ఈ పోషకాలు లభిస్తాయి.
  • అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి.
  • కార్బోనేటేడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే, వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి ముఖ్యమైన పోషకాలు తక్కువగా ఉంటాయి.
  • మాంసం, గుడ్లు తినడం ప్రమాదమేమీ కాదు. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి. అయితే పచ్చి మాంసం, గుడ్లు, కూరగాయలను పట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • శరీరంలో కొవ్వు(ఫ్యాట్)ను నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ ఒక వ్యక్తి 30 గ్రాములకు మించి నూనెలు, 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. చక్కెరలో కేవలం కెలొరీలు మాత్రమే ఉంటాయి, పోషకాలు ఉండవు. కాబట్టి, చక్కెరను కూడా మితంగా తీసుకోవాలి.
  • శారీరక వ్యాయామం, యోగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  • తరచూ నీళ్లు తాగుతుండాలి. ధూమపానం, మద్యపానం వల్ల రోగనిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. ఆ అలవాట్లు ఉన్నవారికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వాటిని మానుకోవాలి.

మధుమేహం లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి దాకా వాడుతున్న మందులను కొనసాగించవచ్చు. వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలని హైదరాబాద్‌ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ ఆర్.హేమలత సూచిస్తున్నారు.

బొప్పాయి, జామ, ఆపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పండ్లలో బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకునేందుకు అవి ఎంతగానో సాయపడతాయి.

నారింజ, నిమ్మకాయలు, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

ఆకు కూరల్లో బీటా కెరోటీన్, విటమిన్ సీ, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ దండిగా దొరుకుతాయి.

ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయలూ, సుగంధ ద్రవ్యాలలోనూ రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు రకాల సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమవుతాయి.

Source: https://www.bbc.com/telugu/india-52533656

Leave a Reply

Your email address will not be published.

Search

+