పార్కిన్సన్స్ మరియు వణుకుడు వ్యాధి

21 Mar 2021 Blog

పార్కిన్సన్స్ నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డొపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు దెబ్బదినటం, క్షీణించటం కారణంగా ఏర్పడుతుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాల నుండి శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి(కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనిని తయారుచేసే కణాలు క్షీణించటం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీంతో శరీర భాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతారు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. అరవై సంవత్సరాలు పైబడిన వారే ఎక్కువగా పార్కిన్సన్స్ వ్యాధికి గురవుతుంటారు.కొన్ని కుటుంబాలలో మాత్రం వంశపారంపర్యంగా వస్తూ చిన్నవయస్సులోని వారిలో కనిపిస్తుంది. మనదేశంలో కోటి మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

సరైన సమయంలో డాక్టరును సంప్రదించి ఆధునిక ఏర్పాట్లుగల ఆస్పత్రిలో చికిత్సి చేయించుకోవటం ద్వారా దీనిని అదుపుచేసేందుకు వీలుంటుంది. పార్కిన్సన్ వ్యాధి చికిత్స సమూలంగా మారిపోయింది. ఈ వ్యాధిగ్రస్థులు తమను వేధిస్తున్న లక్షణాలను అదుపుచేసుకొని సాధారణ జీవితం గడిపేందుకు ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్య(ఔషధ)పరమైన, సర్జికల్ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. పార్కిన్సన్ వ్యాధి మధ్యస్థాయిలో ఉండి శారీరక పరిమతులు ఎదుర్కొంటున్న వ్యక్తులలో వ్యాధి లక్షణాలను అదుపు చేయటంతోపాటు వాడుతున్న మందుల నుంచి గరిష్ట ప్రయోజనం పొందేందుకు ఆధునిక చికిత్సలు తోడ్పడుతున్నాయి. మందుల ప్రయోజనం అగుపిస్తున్న, అదృశ్యమౌతున్నస్థితిల మధ్య ఊగిసలాడుతుంటే పార్కిన్సన్ వ్యాధిగ్రస్థులకు అత్యుత్తమ శస్త్రచికిత్సలు ఉపశమనం ఇస్తున్నాయి. శరీరం విపరీతంగా చలిస్తుండే పార్కిన్సన్ పేషంట్లూ వీటి వల్ల ప్రయోజనం పొందగలుగుతున్నారు.

వ్యాధికి కారణం ఏమిటి?
పార్కిన్సన్స్ వ్యాధి రావటానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూన్నాయి. ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాలు, పరిశీలన ఆధారంగా కొన్ని ప్రాధమిక కారణాలను మాత్రం గుర్తించగలిగారు. అవి: జన్యుపరమైన కారణం – అత్యధిక కేసులలో పార్కిన్సన్స్ వ్యాధి వంశపారంపర్యంగా రావటంలేదు. అయితే వ్యాధికి గురైన వారిలో 15-25 శాతం మంది కుటుంబంలో ఒకరికి ఈ వ్యాధి ఉంటున్నది. వాతావరణ కాలుష్యం -పరిసరాలలోని రసాయనాలు కొన్ని ప్రజలలో డోపమైన్ తయారీ శక్తిని దెబ్బదీస్తున్నట్లు కొందరు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. డోపమైన లోపం సహజంగానే వణుకుడు వ్యాధికి దారితీస్తుంది. క్రిమి,కీటకనాశనలు – కాయగూరలు, ఆహార పంటలపై చీడ పీడలను అదుపుచేయటానికి వాడే క్రిమి సంహారక మందుల అవశేషాలు ఆహారం ద్వార శరీరంలోకి చేరటం వల్ల మెదడులోని డొపమైన్ ను ఉత్పిత్తి చేసే నాడీ కణాలు చనిపోతున్నట్లు భావిస్తున్నారు. వయస్సు- వణుకుడు వ్యాధికి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న కారణం వయసు పై బడటం. ప్రధానంగా అరవై ఏళ్లు దాటిన వారే ఈ వ్యాధికి గురవుతున్నారు. వీరిలో స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే వణుకుడు వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నది. తలకు గాయం- తలకు తీవ్రమైన గాయం కావటం పార్కిన్సన్స్ వ్యాధి రావటానికి గల అవకాశాలను గణనీయంగా పెంచివేస్తున్నది. లోహపు గనుల్లో పనిచేస్తుండటం – మనదేశంలో మాంగనీస్ గనులలో పనిచేసిన కార్మికులలో ఎక్కువ మంది పార్కిన్సన్స్ వ్యాధికి గురయినట్లు గుర్తించారు.

పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు
వ్యాధి ప్రారంభంలో ఆహార పదార్థాల రుచి, వాసన గుర్తించటంలో లోపం ఏర్పడుతుంది. ఇదివరలో ఎంతో ఇష్టంగా తిన్న వంటల పట్ల ఇపుడు ఆసక్తిపోతుంది. రుచిని, పరిమళాన్ని గుర్తించలేని స్థితిలో ఆహారం రుచించదు. ఆపైన ముకవళికలు మారిపోతాయి. ఇదివరలో చిరునవ్వు చిందిస్తూ కనిపించిన వ్యక్తి ముఖం ఎన్నడూలేనంత గంభీరంగా తయారవుతుంది. దీనినే ఫెషియల్ మాస్కింగ్ అంటున్నారు. శరీరం కాస్తవంగిపోతుంది. కదలికలు నెమ్మదిగా, బిగుతుగా మారతాయి. వ్యాధి ముదరుతుండటంతో చేతివెళ్లతో వణుకు మొదలవుతుంది. ఆపైన చేయి, కాలు వణుకుతుంటాయి. ఏ పనీచేయకుండా ఉన్న సమయంలో చేతివేళ్లు, చెయ్యి, కాళ్లు, సెకనుకు నాలుగైదు సార్లు వణుకుతుంటాయి. అదే విధంగా చూపుడువేలు, బొటనవేలు లయబద్దంగా రాపిడికి గురవుతుంటాయి. చేతులు, కాళ్లు వణికే ఈ పరిస్థితిలో నడవటం చాలా ఇబ్బందికరం అవుతుంది. ఈ పరిస్థితిలో వ్యక్తి తన అవయవాలపై అదుపుకోల్పోతున్నట్లు గుర్తించగలుగుతారు. ఈ రకమైన లక్షణాలు కనిపించిన వారిలో దాదాపు 70 శాతం మందికి సంబంధించి అవి పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభంగా డాక్టర్లు గుర్తించారు. ఈ వ్యాధి నిర్ధారణకు ఖచ్చితమైన పరీక్షలు అంటూ ఏమీ లేవు. డాక్టర్లే ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, లక్షణాలను అడిగితెలుసుకోవటం ద్వారా వ్యాధిని, దాని స్థాయిని గూర్చిన ఓ అవగాహనకు వస్తారు. అయితే పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులోని ఇతర భాగాలకు ఏమైనా ప్రమాదం ఉందా అన్న అంశానికి వారు మెుదట ప్రాధన్యాతను ఇస్తారు. ఇందుకోసం బ్రెయిన్ స్కాన్, ఎం.ఆర్.ఐ. వంటి నిర్ధారణ పరీక్షలుచేసి అనుమానాలు నివృత్తి చేసుకుంటారు.

చికిత్స
వణుకుడు వ్యాధి చికిత్స ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపుచేసి, వ్యాధిగ్రస్థులు సాధారణ జీవితం గడిపేట్టు చేసే లక్ష్యంతోనే సాగుతుంది. ఇందుకుగాను వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్యపరిస్థితి – శరీరతత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చికిత్సా వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు మందులు, ఫిజియో థెరపీ, అవసరాన్ని బట్టి శస్త్ర చికిత్సను ఉపయోగపడతాయి. దాదాపు నాలుగు దశాబ్ధాల క్రితం కనిపెట్టిన ఎల్ డోపా అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది. శక్తివంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేని పక్షంలో డోసేజ్ మొత్తంలో లోటుపాట్లు ఏమైనా జరిగితే మొత్తంగా మెదడును దెబ్బదిసే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సాయపడుతూ డొపమైన్ ఉత్పత్తి జరిగేట్లు చేస్తుంది. దీంతో అవయవాలు బిగుసుకుపోవటం, వణుకుడు తగ్గుతుంది.

డి.బి.ఎస్. సర్జరీ
పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు సంబంధించి డి.బి.ఎస్.(డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) కీలకమైన శస్త్రచికిత్స. పార్కిన్సన్ వ్యాధి పెరుగుదల నిరోధించటంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డి.బి.ఎస్) శస్త్రచికిత్స ఎంతగానో తోడ్పడుతున్నట్లు గుర్తించారు. ఇది వ్యాధి పెరుగుదలను నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరచేందుకు పేస్ మేకర్ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వార మెదడులో ఎలక్ట్రోడ్లను అమరుస్తారు. ఇందుకుగాను ముందుగా ఎం.ఆర్.ఐ., సి.టి.స్కాన్ ద్వార వ్యాధిగ్రస్థుల మెదడులో సమస్య ఎక్కడు ఏర్పడింది గుర్తిస్తారు. ఆపైన ఈ చిన్న ఎలక్ట్రోడ్ ను అమరుస్తారు. దీనికి ఓ చిన్న బాటరీ-తీగ ఉంటాయి. మెదడులోని కొన్ని కణాలను తొలగించటం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వటం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. డోపమైన్ తయారీ పునరుద్ధరించగలుగుతారు. పెద్దగా రక్తస్రావం జరగకుండా, ఇన్ఫెక్షన్లకు అవకాశం లేకుండా పూర్తయ్యే ఈ శస్త్రచికిత్స మెదడు శరీరభాగాలను తన అదుపులోకి తెచ్చుకోవటానికి తోడ్పడుతుంది. ఈ సర్జరీలో మెదడులో రక్తస్రావం లాంటి ప్రమాదాలు 2శాతం కంటే తక్కువ. ఇది పార్కిన్సన్ వ్యాధిని లక్షణాలను తీసివేయలేదు. కానీ వాటిని అదుపులో ఉంచగలదు. ఇది సంక్లిష్యమైన, క్రమం తప్పకుండా న్యూరలాజికల్ ఫాలోఅప్ అవసరమైన సర్జరీ. అయితే ఔషధ చికిత్సచేస్తున్నప్పుటికీ వ్యక్తి జీవననాణ్యత ఏమాత్రం ఆమోదకరం కాని స్థాయికి దిగజారినపుడు డి.బి.ఎస్. ప్రభావశీలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.
అయితే మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చాలా సున్నితమైనదని, నిపుణులైన సర్జన్లు అత్యాధునిక పరికరాలు, వసతుల మధ్య నిర్వహించవలసిందని యశోద హాస్పిటల్స్ లోని డిపార్టమెంట్ ఆఫ్ న్యూరాలజీ & న్యూరో సర్జరీకి చెందిన వైద్యనిపుణులు చెప్పారు. అందువల్ల పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో భాగంగా డి.బి.ఎస్. సర్జరీ చేయించుకోవలసి వచ్చిన పక్షంలో అందుకు అనుగుణమైన ఏర్పాట్లు ఉన్న ఆస్పత్రిని ఎంపికచేసుకోవటంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.

Search

+